దబ్బకాయ కుట్ర
బ్లాగడం ఆపను. కానీ... అన్న పర్ణశాల బ్లాగులోని టపాకు రాసిన వ్యాఖ్యలలో ఒక అజ్ఞాత ఒక గొప్ప కుట్ర సిద్ధాంతాన్ని బట్టబయలు చేశారు. తెలుగు ప్యూపుల్, ఆవకాయ, దబ్బకాయ సైట్లలో పేరు కోసం ప్రయత్నించి విఫలులైన వారు అక్కడి కలుషితవాతావరణాన్నే బ్లాగ్లోకానికి ఎగుమతి చేశారన్న సిద్ధాంతమది. ఇక్కడ బ్లాగ్లోకంలో పేరు తెచ్చుకోవటంలో విఫలమయి, పేరున్న బ్లాగరులను వివిధ పద్ధతులలో భయ భ్రాంతులను చేసి, వారిని మానసికంగా హింసించి, పైశాచిక ఆనందం పొందటంలో కృతకృత్యులయ్యారు. మహిళా బ్లాగరులపై అశ్లీలమైన రాతలతోను, ప్రచలిత పురుష బ్లాగులపై వ్యతిరేకంగా దొంగ పేర్లతో వ్యంగ రాతలు రాసి తమ ఆగడాలు మొదలెట్టారు. ఒక కుటుంబంగా ఉన్న బ్లాగరుల మధ్యనే తగాదాలు సృష్టించటంలో కూడా విజయం సాధించారు.
"ఈ తెలుగు అని ఒక గ్రూపు ఏర్పాటు చేసి ఏదో సాధిస్తున్నామని చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళ అసలు ఎజెండా ఏంటో కూడా తెలియక సతమతమయ్యారు. ఈ గ్రూపు లో పెద్దలు ఎలా ఉన్నారంటే మనలో పుట్టి పెరిగి ఎమ్మెల్యే నో ఎంపీ నో ఆయిన ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తారు. మనమేం చెప్పినా వాళ్ళు వినరు. అంతా వాళ్ళిష్టమొచ్చినట్టే చేస్తారు. కొంతమంది అనుమానం ఏంటంటే వీళ్ళూ ఈ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని బతిమాలో బెదిరించో డబ్బులు దండుకోవడమే కాకుండా ఇళ్ల స్థలాలు కూడా కొట్టేయ్యాలని ప్లాన్ చేస్తున్నారని."
-ఈ తెలుగు పై ఎన్ని అపోహలో. ఈ అపోహలు తొలగించటానికి వీవెన్ రెండు టపాలు రాశారు.
e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
అవి సరిగా చదవక వీళ్లు తమ సందేహాలు లోకానికి వెళ్లడించి, ఈ తెలుగు పై తమ వంతు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలకై ఈ తెలుగు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్న వీరి అభియోగం హాస్యాస్పదం. ఈ తెలుగు అనేది ఒక సంఘం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ సొసైటీ నడుస్తుంది.
కొత్తగా వస్తున్న అవాంఛనీయ ధోరణి. దీప్తిధార మరి కొన్ని ఇతరుల బ్లాగులలో కొత్త పాళి, సుజాత, మరికొంతమంది పేర్లతో దొంగ ఉత్తరాలు రాసి తుంపులు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తే పలు పేర్ల తో వ్యంగ విమర్శలు, బెదిరింపు ఉత్తరాలు రాయటం అనే కొత్త సంస్కృతి కూడా బయలుదేరింది. బ్లాగరులు ఈImpersonator ను జాగ్రత్తగా గమనిస్తుండాలి.
తెలుగు భాషా - సంస్కృతీ ధ్వంసమునకై కుట్ర
ఈ సిద్ధాంతమును హరిసేవకుడు దుర్గేశ్వరుని మిత్రుడు ప్రతిపాదించినది. హరిసేవ బ్లాగులోని e-తెలుగు కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల..మా తల్లీ కన్నీరుపెడుతోందో.... అనే టపాలో ఈ సిద్ధాంతాన్ని చూడవచ్చు. e తెలుగు వారి కృషివలన నేడు పెక్కుమంది కంప్యూటర్లో తెలుగు వాడటం నేర్చుకుంటున్నారు. తెలుగు బ్లాగుల గురించి ప్రజలు పత్రికలలో చదివి, e తెలుగు వారి సహాయంతో కూడలి, లేఖిని గురించి తెలుసుకొని పెక్కుమంది తాము మరుస్తున్న తెలుగుకు ఒకమారు మెరుగుపెట్టి తెలుగులో బ్లాగు రాయటానికి సంసిద్ధమవుతున్నారు. ఇట్లు జరిగిన తెలుగుకు తిరిగి పూర్వ వైభవమెక్కడ సంభవించునో అని ఈ ముష్కరులు స్త్రీ పురుష భేదం లేకుండా వారిని తమ రచనలతో వ్యంగ వాఖ్యలతో తూట్లు పొడిచి, గాయబరచి వారిని తెలుగుకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముష్కరులు తెలుగు భాషకు, సంస్కృతి కి కి తమ శాయ శక్తులా హాని చేయ తలపెట్టుతున్నారు.
"మొత్తానికి తాలిబానైజేషన్ ఆఫ్ తెలుగు బ్లాగ్‌లోకం అన్నమాట! అందుకనేనా మొన్నటి సభ గురించి ఎవరూ ఇంకా నివేదికని ఇవ్వలేదు. e-తెలుగు వారు కూడ కిమ్మనటం లేదు." -అని కొందరు సభ్యులభిప్రాయపడుతున్నారు.
కడుపు మంట, ఉక్రోషం, అసూయల తో కుట్ర
పేరున్న బ్లాగరులపైనే కవ్వించే వ్యాఖ్యలు, కత్తిపోటు మాటల తూటాలు ఎందుకని?
"అసలు యేమీ అనకున్నా కడుపు మంటతో పేలిపోతారు ఇంకొందరు సన్నాసులు. మడిసి మనసు కుళ్ళిపోనాక సేయగలిగేది ఏముంటుంది సెప్పు?" అని అంటున్నది రత్తి; నేను-లక్ష్మి అనే బ్లాగులోని ఆడోళ్ళు-బ్లాగులు-పెమదావనాలు- యేందియన్నీ? అనే టపాలో. మరి దీనికి ఏమి చెయ్యలి? ఎట్లా చేస్తే పరిష్కారం లభిస్తుంది? క్షోభ పడిన హృదయాలు మరలా తేలికెలా పడతాయన్నదానికి రత్తి మాటలలో జవాబు లభిస్తుంది.
""మంచి బుద్ధికీ, సెడు బుద్ధికీ ఆడా మగా అన్న తేడా లేదు మావా. దేవుడూ, రాచ్చసుడూ ప్రతి మనసులోనూ ఉన్నారు. మనం సేసేది ఒప్పా తప్పా అని లెక్కలేసుకుంటే గొడవలెందుకు ఐతాయి సెప్పు. అందరూ సల్లంగుండాలి, అందరి జీవితాలు మంచిగుండాలి, ఎప్పుడు పేలిపోతుందో తెలియని ఈ బుడగ మీద మమకారంతో సాటి వాళ్ళ జీవితాలను పాడు సేసే పాడు బుద్ధి ఎవరికీ ఉండకూడదు. అలా ఉంటే బుద్ధి మార్చుకుని సంతోషంగుండాలి మావా, సంతోషంగుండాలి"
ముగింపు
ఈ ముష్కరులు తమ లక్ష్యాన్ని సాధించగలిగారా?
మహిళల బ్లాగులు కొన్ని మూతబడ్డాయి. పర్ణశాల బ్లాగు కూడలి, జల్లెడల నుంచి అదృశ్యం కాబోతుంది. సీనియర్ బ్ల్లాగర్లను హేళన చేయటంలో తాత్కాలిక విజయం పొందారు. ఎంతకాల మిలాగా? పిల్లి ఎదురు తిరగ గలదని, ఈ ముష్కరుల ఆటలు కట్టే ఈ ముష్కరుల ఆటలు కట్టే రోజు త్వరలో రాగలదని ఆశిద్దాము.

No comments:
Post a Comment